కలుపు మందు వాడేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
ప్రస్తుత మార్కెట్లో పంట ఎదుగుదలకు మరియు కలుపు నివారణకు వివిధ రకాల మందులు లభిస్తున్నాయి, కానీ ఏ పైరుకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలి అనే ప్రశ్న రైతులందరికీ ఉన్నప్పటికీ సరైన అవగాహన లేక రైతులు తమకు తోచిన మోతాదు లో మందులు చల్లుకోవడం వలన చాలావరకు నష్టపోతున్నారు, అయితే కలుపు అనేది ప్రధాన పొలంలో పెద్ద సమస్యగా నిలుస్తుంది ఈ కలుపు నీటికి మరియు వివిధపోషకాలకు పంటతో పోటీ పడి పంటనష్టం కలుగచేస్తుంది .
సిఫారసు చేయని మరియు పూర్తి వివరాలు తెలియని మందులువాడుట వలన కలుపు నిర్మూలన సరిగా జరగదు. అంతే కాకుండా పంటకు నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఉదాహరణకు మాగాణి వరిలో, నాటిన ౩ నుండి 5 రోజులలోపు కలుపు నిర్మూలనకు 35 గ్రాముల ఆక్సదయార్జిల్ అనే కలుపు మందును వాడుకోవాలి, అలా కాకుండా ఆ మందును తక్కువ మోతాదులో వాడితే ప్రయోజనం ఉండదు అలా అని ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బతినే ప్రమాదం ఉంది .
కలుపు మందు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం :
- కొన్ని రకాల కలుపు మందులు పంట విత్తిన రెండు రోజులలోపు అంటే పంట మొలకెత్తక ముందు పిచికారీ చేయాలి వాటిని ప్రీ ఎమెర్జెన్స్ కలుపు మందులు అంటారు, ఉదాహరణకు పెండిమిథాలిన్ , ఈ కలుపు మందు పంటపై పడకుండా కలుపు పైన మాత్రమే పిచికారీ చేసుకోవాలి
- వరిలో 2 - 4 D సంబంధిత మందులు వాడినప్పుడు ప్రక్క పొలంలో సున్నిత పంటలు అనగా ప్రత్తి, మిరప పంటలపైనా పడకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి
- పొలంలో కలుపు మందు వేసుకునేటప్పుడు ఆ మందు యొక్క అవశేషాలు ముందుగా తెలుసుకోవడం మంచిది ఉదాహరణకు అట్రాజిన్ అనే మందు మొక్కజొన్నలో విశేషంగా పనిచేసినప్పటికీ ఆ మందు యొక్క అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఉండుట వలన తర్వాత వేసే పంట పైన ప్రభావం చూపిస్తుంది
- మొండిజాతి మొక్కలైనా తుంగ, గరిక, దుర్భ మొదలగు వాటి నిర్మూలనకు పారక్వాట్ వంటి మందులు 4 నుండి 6 ఆకుల దశలో పూత రాకముందే పిచికారీ చేసుకోవాలి
- నిర్దిష్టమైన/స్పష్టమైన సూచనలు లేనిదే కలుపు మందులను, పురుగు లేదా తెగుళ్ల మందులతో కలపరాదు
- సాధ్యమైనంత వరకు కలుపు మందులను హాండ్ స్ప్రేయర్ తోనే పిచికారీ చేయాలి
- పవర్ స్ప్రేయర్ ను వాడదలచినప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి
- కలుపు మందులు పిచికారీ చేయుటకు సాధ్యమైనంత వరకు స్ప్రేయర్లను విడిగా ఉంచుకోవాలి
- ఎల్లప్పుడూ స్ప్రేయర్ల నుండి మందు సమంగా వచ్చేటట్లు పిచికారీ చేయాలి.
- ఒక ఎకరా విస్తీర్ణంలో కలుపు మందు పిచికారీ చేయడానికి 200 లీ. మందు నీరు అవసరమవుతుంది.
- ఎండ మరీ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే గాలి ఎక్కువ వీస్తున్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయరాదు
- కలుపు మందులు, పురుగు మందులవలె విషపూరితాలు, కనుక వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి.
- కలుపు మందులను వెనుకకు నడుస్తూ పిచికారీ చేయాలి
- సాధ్యమైనంతవరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, అన్తరకృషి చేయుట మొదలగు సేద్య పద్దతులను కూడా పాటిస్తూ సమగ్ర కలుపు యాజమాని పద్దతులను అవలంభిస్తే పర్యావరణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు
ఈ విధంగా పైన చెప్పిన జాగ్రత్తలు పాటించినచో మీ పొలం లో కలుపును సమర్ధవంతంగా అరికట్టవచ్చును, మరిన్ని పంట సలహాల కోసం జై హో కిసాన్ మొబైల్ ఆప్ ను డొన్లోడ్ చేసుకోండి.